‘కొరిటాల’ ఇంటి పేరు వృత్తి పేరుగా మారిన వ్యక్తి
కొరిటాల రామస్వామి చౌదరి (బొమ్మల రామస్వామి) జననం 1910.వ్యవసాయానికి చెందిన సాధారణ కుటుంబంలో పొనుగుపాడు నందు జన్మించారు.తల్లిదండ్రులు పేరయ్య, అచ్చమ్మ. తాత కోటయ్య, నాయనమ్మ అక్కమ్మ.ముత్తాత వెంకటాద్రి. తాతమ్మ మహలక్ష్మమ్మ.
ప్రాధమిక విద్య పొనుగుపాడు.ఆరవ తరగతి నుండి పదకొండవ తరగతి వరకు నరసరావుపేటలో చదివారు. రామస్వామి చౌదరి మొదట సాతులూరు గ్రామానికి చెందిన గుమ్మడి వీరయ్య, సుబ్బమ్మ దంపతుల ప్రధమ కుమార్తె లక్ష్మమ్మను 09.05.1935 న వివాహమాడారు.దురదృష్టావశాత్తు వివాహమైన కొద్ది కాలానికే ఆమె ఆకాల మరణం చేసింది. ఆతరువాత పొనుగుపాడు గ్రామానికి చెందిన గుర్రం రత్తయ్య, సీతమ్మ దంపతుల కుమార్తె తిరుపతమ్మను (స్వంత అక్క కుమార్తె) 04.06.1943 న ద్వితీయ వివాహమాడారు.
రామస్వామి చౌదరి. తిరుపతమ్మ దంపతుల సంతానం విజయలక్ష్మి, అచ్చమ్మ, సీతామహలక్ష్మి, సత్యవతి, రేవతి, రమణబాబు. చివరి సంతానంగా జన్మించిన రమణబాబు పన్నెండు సంవత్సరాలు వయసులో అకాల మరణం చెందారు.
ఆనవాళ్లు చెబితే చాలు సజీవ చిత్రాలే
రామస్వామి చౌదరి ఇంటి పేరును అందరూ మర్చిపోయారు. ప్రాణ సమానంగా భావించి సాధన చేసిన చిత్రకళే ఆయన ఇంటి పేరుగా మారింది. ‘కొరిటాల రామస్వామి’ పేరును ‘బొమ్మల రామస్వామి’ గా మార్చి వేసింది. అందరూ అప్పడూ ఇప్పడూ ఆయన ప్రసక్తి వచ్చినప్పడు’బొమ్మల రామస్వామి’ అనే వ్యవహరిస్తుంటారు.
జొన్నన్నం, జొన్నసంకటి తప్ప సున్నన్నం (వరి అన్నం) లేని ఆ రోజుల్లోనే ఫొటోగ్రఫీ పరమార్ధాన్ని, చిత్రకళ సొగసుల్ని గుంటూరు జిల్లా ప్రజలకు రుచి చూపించారు.మిలిట్ కెమెరా నుంచి పీల్డ్ కెమెరా వరకు ఆయన చెప్పిన మాట బుద్దిగా విని సజీవ చిత్రాలకు అద్దం పట్టాయి.ఇప్పడు ఉన్న సాంకేతికాభివృద్ధి అంతగా లేని ఆ రోజుల్లో ఫొటో క్వాలిటిగా తీయటానికి తగిన వెలుతురు కోసం ప్రత్యేక పద్దతులు తీసుకునే వారు.
ఒక గాజు పలకను తీసుకుని దానికి ఒక వైపు ద్రావకం పూత పూసి ఆరబట్టేవారు. ఆ గాజు పలకను చీకటి గదిలో పుల్ సైజు కెమెరా నందు అమర్చేవారు.ఆ గాజు పలక ద్వారా ఆయన తీసే ఫొటో పిల్ముకు తగినంత వెలుతురు ఉండే విధంగా చూచుకొని ఫొటో తీసేవారు.ఆ తరువాత ఆ గాజు పలకను అతి భద్రంగా బయటకు తీసి ‘రీటచింగ్’ చేసేవారు. ప్రింటు, డెవలప్ంగ్ ఆయనే చేసేవారు.
సూర్యుని వెలుతురు గాజు ముక్క పై పడే ఏర్పాటు చేసి, ఫొటో ప్రింటింగ్ పేపరును గాజుముక్క క్రింద ఉంచి సూర్యరశ్మి వేడితో ప్రింటు తీసేవారు.దానికి గోల్డు సొల్యూషన్, అమ్మోనియం సల్పేట్ కలిపి బ్రౌన్ కలర్ ప్రింట్ తీసేవారు.ఇలా తెలుపు నలుపు, బ్రౌను కలరు పొటోలు వివిధ భంగిమలలో తీసి ఆ రోజుల్లో తన సత్తా చాటారు. బొమ్మల రామస్వామిగా రూపు దాల్చటానికి ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు.ఎటువంటి పాఠశాలలో శిక్షణ పొందకుండా చిన్నతనంలోనే చిత్రకళలో నైపుణ్యం సంపాదించారు. పేద రైతు కుటుంబంలో జన్మించి పశువులు కాసే స్థితి నుండి ప్రఖ్యాత చిత్రకారుని దశకు చేరుకున్నారు.
గ్రామంలో రేవతి ఫొటో ష్టూడియో స్ధాపకుడు.
పెద్ద కుమార్తె విజయలక్ష్మిని అటు మేనల్లుడు, ఇటు బావ మరిది గుర్రం రామారాయుడుతో వివాహం జరిపించాడు.ఆ దంపతులను తనకు చేదోడు వాదోడుగా ఆయన ఇంట్లోనే ఉంచుకున్నారు.రామస్వామి చౌదరి చిత్ర లేఖనం వృత్తిలో కుమార్తె విజయలక్ష్మి పాలుపంచుకునేది.
తన తండ్రి రామస్వామి చౌదరికి అసలు చిత్రకళపై ఆసక్తి ఏర్పడటానికి కుమార్తె విజయలక్ష్మి చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.చిన్నతనం లోనే చిత్ర లేఖనం పై ఆసక్తి కలగటానికి తగిన పరిస్ధితులు, ఆ తరువాత వృత్తిలో ఎదురైన అనుభవాలు, సంఘటనలు గురించి 07.10.1990 న ఆంధ్రభూమికి స్వయంగా ఆయన తెలిపిన వివరాలు గురించి వ్యాసం ప్రచురించారు.
ఆయన చిన్నతనంలో గొల్ల భాగవతులు, హరిదాసులు, తోలు బొమ్మలు ఆడించేవాళ్లు, ఇంకా పగటి వేషగాళ్లు వారి ఇంటి ఎదురుగా ఉన్న పీర్లచావిడి స్దలంలో విడిది చేసేవారు. జంతు చర్మాల మీద, అట్టల పైన రకరకాల రంగులుతో వాళ్ళు తయారు చేసిన బొమ్మలు ఆయన్నెంతో ఆకర్షించాయి. పొలం వెళ్లినా, పశువులు కాస్తున్నా బొమ్మలపై ధ్యాస పెరిగింది. మెత్తగా జిగురుగా ఉన్న కుంట మట్టిని తీసి బొమ్మను చేయటం, ఆ బొమ్మకు గులాబి రంగులో ఉన్న నాగజెముడు కాయల రసం పూయటం చేసేవారు.
జీవన సమరాన్ని చాలెంజ్ గా తీసుకున్న బొమ్మల రామస్వామి
ఆ రోజుల్లో గ్రామంలో రైతులు “నీలిమందు” చెట్లను పెంచి నీటి తొట్టెలలో వండించి విక్రయించే వారు. వాళ్లను బ్రతిమలాడి కొంచెం నీలిరంగు తీసుకుని తాను తయారు చేసిన మట్టి బొమ్మలకు వేసేవారు. ఇంకా బొమ్మల నలుపు, తెలుపు రంగులకు బొగ్గుపొడి, సుద్దపొడి వాడేవారు.అప్పట్లో గుంటూరులో ప్రముఖ శిల్పకారుడు కీ.శే.నూతలపాటి నరశింహం ఆధ్వర్యంలో శిల్పాశ్రమం నడుప బడేది. నూతలపాటి నరసింహం ప్రముఖుల చేత గండపెండేరం తొడిగించుకుని “శత శిల్పి” బిరుదుతో సన్మానం పొందారు.
ముక్త్యాల జమీందారుకు ‘శతశిల్పి’ పట్ల గొప్ప ఆరాధనాభావం ఉండేది. ఆప్పట్లో సంవత్సరానికి రెండు రుపాయలు చెల్లించి రాష్ట వ్యాపితంగా ఆయన నుండి కొందరు శిష్యులు పోష్టు ద్వారా డ్రాయింగు నేర్చుకునేవారు.అలాంటి ‘శతశిల్పి’ దగ్గర మన రామస్వామి శిక్షణ కొరకు 08.07.1931 న చేరారు. అక్కడ ఒక సంవత్సరం ఆరు మాసాలు శిక్షణ పొందారు. అ శిక్షణ కాలంలో అవుటు లైన్ డ్రాయింగ్, మోడల్, సుద్దతో బొమ్మలు చేయటం, అచ్చుకట్టటం, పోతపోయటం, చెక్కుడుపని సాధన చేసారు.
ఆయన తండ్రి పేరయ్యకు ఈ బొమ్మలు కూడు పెట్టవు అనే ఉద్దేశ్యం మనసులో ఉంది. కుమార్డు రామస్వామి చౌదరిని ఎలాగైనా ఇంటికి రప్పించాలనే ఉద్దేశ్యంతో డబ్బు పంపకపోతే తిరిగి వస్తాడని సరిగా డబ్బు పంపేవాడు కాదు.అయినా పట్టుదలతో పస్తులుండి పవి నేర్చుకుంటుంటే, ఆయన పరిస్ధితి తెలుసుకున్న ‘శతశిల్పి’ తన ఇంట్లోనే భోజనం పెట్టి పని నేర్పాడు. గురువు ‘శతశిల్పి’ నూతలపాటి నరశింహం మరణంతో తిరిగి ఇంటి ముఖం పట్టారు.
ఆ తరువాత ఫొటోగ్రపీలో అనుభవం కొరకు ఫొటోస్టూడియోలో 04.03.1933న చేరి కొంతకాలం పనిచేసారు. అదే కాలంలో రామస్వామి చౌదరికి జబ్బు చేసి చేతి వ్రేళ్లు సచ్చుబడినవి. ఆయినా అధైర్యంతో కృంగిపోకుండా ఫొటోగ్రఫీ వృత్తిలో మెలకువలు తెలుసుకుని తిరిగి గ్రామం చేరారు.
మలుపు తిరిగిన కొరిటాల జీవితం
జీవన సమరాన్ని చాలెంజ్ గా తీసుకున్నారు. ఆ చాలెంజ్ తో ఆయన స్వంతంగా ఫొటోగ్రఫీ వృత్తిలో 27.12.1934న ఆరంగేట్రం చేసారు. ఆయినా ఏదో తెలియలి అశాంతి ……’ ఆరాటం……. ఆందోళన……. ఒంటరితనం ఆయనను వేధిస్తున్న రోజుల్లో తనకొక చిత్రమైన అవకాశం వచ్చినట్లు 07.10.1990 న ఆంధ్రభూమిలో ప్రచురించిన వ్యాసంలో రామస్వామి చౌదరి ఇలా తెలిపారు.
పొనుగుపాడు సమీప గ్రామమైన సాతులూరులో నివసించే బేతంచర్ల వెంకట్రాయుడు ఒక రోజు రామస్వామి చౌదరి దగ్గరకు వచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం పునరధ్దరణకు పాటుబడిన ‘ఆంధ్రా వాల్మీకి’ వావికొలను సుబ్బారావు సిమెంటు పోత విగ్రహం తయారు చేయవలసిందిగా ఆయనను కోరారు.కేవలం ఆంధ్రా వాల్మీకి ఆనవాళ్లు మాత్రమే వెంకట్రాయుడు చెప్పారు.
అదొక సవాలుగా తీసుకుని వావికొలను విగ్రహం తయారు చేసారు.(ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 – 1936) కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన ధనంతో స్వామి వారికి ఆభరణాలు చేయించడంతో బాటు రామ సేవా కుటీరాన్ని నిర్మించాడు.)
ఆ తరువాత కొద్ది రోజులకే ఆంధ్ర వాల్మీకితో పాటు అయన శిష్యగణంతో పర్యటనచేస్తూ సాతులూరు వచ్చారు. ఆయనను చూడటావికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తిరునాళ్లలా సాతులూరు వచ్చారు.వావికొలను వారి మరో రూపంలా కనిపించే విగ్రహ ప్రతిమను చూచి ఆశ్చర్యపోయారు. రామస్వామి చౌదరి చేసారంటే ఎవ్వరూ నమ్మలేదు. మద్రాసులో ప్రత్యేకంగా నిపుణులతో తయారు చేయించి ఉంటారని వాదించారు. చివరకు నిజం తెలుసుకున్నారు.బొమ్మల రామస్వామిని అప్పటికప్పడు బంగారు పతకం, నూతన వస్త్రాలుతో సత్కరించారు.
వైవాహిక జీవితం
సాతులూరు గ్రామానికి చెందిన గుమ్మడి వీరయ్య, సుబ్బమ్మ దంపతులు రామస్వామి చౌదరి కి జరిగిన సత్కారానికి, ఆయన చిత్రకళా నైపుణ్యానికి ముగ్దులైనారు.ఆయన గొప్పదనాన్ని గుర్తించి వారి ప్రధమ కుమార్తె లక్ష్మమ్మను ఇచ్చి ది.09.05.1935న వివాహం జరిపించారు.దురదృష్టావశాత్తు ఆమె 21.10.1938న కాలం చేసింది.దానితో ఒంటరి జీవితం ఏర్పడింది.అలానే కాలం రెండేళ్లు సాగింది…….నరసరావుపేటలో మొన్నటి వరకు ఉన్న ఏంజల్ టాకీసుకు (ఆ రోజుల్లో డేరా హాలుగా ఉండేది) మాలపిల్ల సినిమా వచ్చింది.
ఆ సినిమా చూచిన తరువాత మిత్రుల ప్రోద్బలంతో ఎటువంటి ఆర్బాటం లేకుందా ప్రముఖ హేతువాదులు ఆవుల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో అక్క కూతురు తిరుపతమ్మను పూలదండలుతో ద్వితీయ వివాహమాడారు. అప్పటినుండి పొనుగుపాడుకే పరిమితం కాకుండా ఊరూరా తిరిగి ఇనప్పెట్టెల పైన, గోడల పైన, డ్రామా కర్టెన్ల పైన రంగు రంగుల వర్ణ చిత్రాలు గీసి పేరు సంపాదించారు. అప్పటి నుండి ప్రజల మనసులో ‘బొమ్మల రామస్వామి’ గా గుర్తింపు పొందారు.
ఆ డబ్బుతో మొదటిసారిగా అప్పట్లో అన్ని హంగులు కలిగిన పుల్ సైజు పీల్డ్ కెమెరా స్వంతంగా 31.12.1935 న కొన్నారు. అప్పటి నుండి ఫొటోగ్రాపర్ గా, చిత్రకారుడుగా జీవితంలో నిల ద్రొక్కుకున్నారు.
రొంపిచర్ల మండలం, కుంకలగుంట గ్రామానికి చెందిన ప్రముఖ కవి బొల్లు వెంకయ్య రామస్వామి చౌదరి చిత్రకళా నైపుణ్యానికి ముగ్దుడై పద్య రూపంలో ప్రసంశిస్తూ తన అభిమానాన్ని చాటారు.
ఆయన నిరంతర కృషికి గుర్తింపుగా గుంటూరు జిల్లా అసోసియేషన్ వారు 1986 అక్టోబరు 10 న గుంటూరులో ఘనంగా సన్మానించారు.ఆయన వద్ద తాడికొండ గ్రామానికి చెందిన రేకా శ్రీరాములు శిష్యరికం చేసారు.
రామస్వామి చౌదరితో పాటు గుంటూరు జిల్లా పొటోగ్రాపర్సు అసోసియేషన్ వారిచే గురువు రామస్వామి చౌదరి, శిష్యుడు రేకా శ్రీరాములు ఇరువురు ఒకేసారి సన్మానం పొందుట విశేషం.
ఎలాంటి ఫొటో లేకుండా ఆత్మీయులను పోగొట్టుకున్న వారు మన బొమ్మల రామస్వామిని కలసి ఆనవాళ్లు చెబితే చాలు సజీవ చిత్రం వారి ముందు ప్రత్యక్షమయ్యేది!!…
హర్మోనిష్టు, మంచి సంగీత, నాటక కళాకారుడు
ప్రకాశం జిల్లా సింగరాయకొండపై వేంచేసిన లక్ష్మీనరసింహ స్వామి ఫొటో తీసినా బొమ్మ రాదు అనే ప్రతీతి ఉండేది.దానిపై అలయ అర్చకులు కూడా సవాలు విసిరారు.మరో వైపు ఫొటో తీయటానికి ఆలయ దర్మకర్తలు అనుమతించే వారు కాదు.
ఎవరైనా ఫొటో తీయటానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏవో నష్టాలు జరుగుతున్నాయని పుకారు ఉండేది.మన బొమ్మల రామస్వామి సవాలు విసిరిన అర్చకులతో ఒక రోజు రాత్రి రెండు పెట్రోమాక్స్ లైట్లు పెట్టించి సృష్టంగా, అందంగా చూడగానే భక్తిభావం కలిగేలా ఫొటో తీసి వారికి అందించారు.
మన బొమ్మల రామస్వామి చేత మన ఇంట్లో బొమ్మ వేయించకపోతే ఈ సంపద ఎందుకు? నా పెద్దరికం ఎందుకు? అనే స్థితి ఆ రోజుల్లో గ్రామాల్లో ఉండేది……..ఇలాంటి సంఘటనలు ఎన్నో… ఎన్నెన్నో….
శారదా నాట్య మండలి నాటక సమాజంలో రామస్వామి చౌదరి
ఆయన చేత ఫొటో తీయించుకోవటం, ఆయనతో కలసి ఫొటో తీయించుకోవటం హోదాకు ఒక గుర్తింపుగా భావించేవారు.ఇప్పటికీ ఆయన తీసిన ఫొటోలు గ్రామాల్లో చాలా కుటుంబాల నందు ఉండుట విశేషం.
అంతేగాదు రామస్వామి చౌదరి మంచి హర్మోనిష్టు, మంచి సంగీత, నాటక కళాకారుడు. గ్రామంలో కొరిటాల మస్తానురావు చౌదరి, తూము వెంకటేశ్వర్లు, తదితరులు స్ధాపించిన శారదా నాట్య మండలి నాటక సమాజంలో సభ్యులు.
రామస్వామి చౌదరి పల్నాటియుద్దం, వివాహవిఛ్చేధం, రంగూన్ రౌడి ఇంకా పలు నాటకాలలో నటించారు. ఆ నాటకాలకు ఆర్టు డైరక్టరుగా పని చేసారు.
పొనుగుపాడు ప్రజలు మర్చిపోలేని బొమ్మల రామస్వామి
తన ముఖ్య స్నేహితుడు, పాతూరి రామస్వామి (భజన పంతులు) బృందంతో 28.03.1941 న పొనుగుపాడు నుండి బయలుదేరి భజనతో కాలినడకన భద్రాచలం వెళ్లారు.
దురదృష్టావశాత్తు 1980 ఆ ప్రాంతంలో కుడి కాలికి కురుపు లేచి వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ లో మోకాలు వరకు తొలగించారు.ఆ పరిస్ధితులలో కూడా రామస్వామి చౌదరి ఫొటోగ్రఫీ రీటచింగ్ వ్యాపకం మానలేదు. నేలపై కూర్చొని అటు ఇటు కదులుతూ పని చేసారు.
ఆయన మూడవ కుమార్తె ‘రేవతి’ పేరుపై ‘రేవతి పొటో ష్టూడియో’ ను చాలా కాలం నడిపారు. ఏది ఏమైనా ఆ రోజుల్లో పొనుగుపాడు ప్రజలు వేరే దూర ప్రాంత గ్రామాలకు వెళ్లన సందర్బంలో పొనుగుపాడు అని చెప్పగానే ‘బొమ్మల రామస్వామి గారి ఊరేనా’ అని అడిగేవారు.
రామస్వామి చౌదరి 16.08.1992న తన అభిమానులను, పొనుగుపాడు ప్రజలను దుంఖ సముద్రంలో ముంచి ఈలోకాన్ని శాశ్వతంగా వీడిపోయారు.