పొనుగుపాటి వంశీకుల చరిత్ర.

ఈ వంశీకులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. గోత్రం: కౌండిన్యస. ఋషులు:వశిష్ఠ, మైత్రావరణ, కౌండిన్యస. వేదం:కృష్ణ యజుర్వేదం.
నా చిన్నతనంలో 1960-65 ఆ ప్రాంతంలో చాలా మంది మా బజారులోనే (పడమర బజారు) నివసించేవారు. ఈ వంశీకులు పూర్వం నుండి గ్రామానికి కరణీకం వృత్తి చేసారు. ఎక్కువ మంది వ్యవపాయ భూమి కలిగి వ్యవసాయం, పశుపోషణ చేసారు.
మరి కొంత మంది వైద్యవృత్తి, విద్యాబోధన చేసేవారు.
కాలమాన మార్పులు ననుసరించి ఉద్యోగరీత్యా గానీ, ఇతర కారణాల వల్లనైతేనేమి ఏరే ప్రదేశాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం గ్రామంలో కొంత మందికి కొద్ది కొద్దిగా అస్తులు ఉన్నవి. కానీ నివాసంగా ఎవ్వరూ లేరు.

సుమారు 1958 వరకు గ్రామ కరణంగా పని చేసిన లక్ష్మీకాంతారావు భార్య అనంత రామమ్మ మొన్న మొన్నటి వరకు గ్రామంలో ఉండేది.
ఆమె కారణాంతరాల వల్ల హైదారాబాదు, మీర్ పేటలో కుమార్తె విజయలక్ష్మి దగ్గర ఉంటుంది.
పొనుగుపాటి వారి పూర్వీకుల వివరాలు తెలుసుకుందామని అమె దగ్గరకు వెళ్లటం జరిగింది.
అమెతో కాసేపు మంచి చెడూ ముచ్చటించి, మీ పూర్వీకుల వివరాలతో కూడిన వంశవృక్షం ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగాను. అలాంటిది ఏమిలేదయ్యా కావాలంటే నాకు తెలిసినంతవరకు చెపుతానని అంది.
మా సంబాషణ ఆమె కుమార్తె విజయమ్మ విన్నది. సిరిపురపు వేంకటరమణయ్య తాతయ్య శత జయంతి ఉత్సవం పుస్తకంలో నేను చూసినట్లు గుర్తు అని మాతో అంది. దాని మీదట నేను అమ్మా ఆ పుస్తకం శ్రమ అనుకోకుండా కొద్దిగా వెతికి ఇవ్వండమ్మా అని అడిగాను.శ్రమ తీసుకుని ఆ పుస్తకం వెతికి తీసుకొని వచ్చింది.
ఆ పుస్తకం నేను పరిశీలించగా సిరిపురం పూర్వీకుల వంశవృక్షములతో పాటు మొన్న మొన్నటి వరకు ఈ గ్రామంలో నివసించిన వారి అందరి పేర్లతో కలిగిన వంశవృక్షం జతపర్చబడి ఉంది.
మూల పురుషుడు వెంకమరాజు
వెంకమరాజు వంశవృక్షం.(CLICK HERE)
పై వంశవృక్షం ఆధారాన్నిబట్టి పరిశీలిస్తే ఈవంశీకుల మూల పురుషుడు వెంకంరాజు అని తెలుస్తుంది. ఇతను సుమారు 18 వ శతాబ్థం ద్వితీయార్థం అనగా 1750 – 1800 మధ్య కాలానికి చెందిన వాడు. ఇతని సంతతి పాపరాజు, దేవల్ రాజు, అయ్యపరాజు, వీర్రాజు. పూర్వం నుండి ఈ వంశీయులు గ్రామాధికారుల వ్యవస్థ రద్దు అయ్యేంత వరకు పొనుగుపాడు గ్రామానికి మజుకూరి కరణాలుగా పనిచేసారు.
పాపరాజు నిర్మించిన శ్రీ అంజనేయస్వామి దేవాలయం.
ఇది మనకు తెలియాలంటే ఇంకా కొంత చరిత్ర తెలుసుకోవాలి. బ్రిటీషు పాలనలో, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన గుంటూరు సర్కారు 1790లో గ్రామాల సర్వే బాధ్యతను కాలిన్ మెకంజికి అప్పగించింది. గుంటూరు జిల్లాలోని అన్ని గ్రామాల సమాచారం సేకరించే కార్యక్రమం పూర్తి చేసి కాలిన్ మెకంజి అప్పటి సర్కారుకు అప్పగించాడు. వీటిని గ్రామ కైఫియ్యత్తులు అంటారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైన్స్ వారు వీటిని 1988లో ప్రచురించారు.
ఆ సర్వేలో భాగంగా పైన వివరింపబడిన వంశవృక్షం ప్రకారం వెంకంరాజు ద్వితీయ సంతానం మజుకూరి మిరాసిదారుడైన దేవల్ రాజు, అయ్యపరాజు (అప్పన్నయ్య అయ్యపరాజుకు మరో పేరు కావచ్చు), గోపరాజు, (వారసులు కావచ్చు) పొనుగుపాడు గ్రామానికి చెందిన సమాచారంను 1817 లో తెలిపారు.
కైఫియ్యత్తులు లింకులు
(CLICK BELOW LINKS )
1.Kaifiyats 3rd part Page no. 204.
1A.Kaifiyats 3rd part Page no. 205.
2. Kaifiyats 4th part page no.192.
2A. Kaifiyats 4th part page no. 193
‘వొణుకుబాడు’ / ‘పొణుకుపాడు’
పై కైఫియత్తుల ప్రకారం పొనుగుపాడు గ్రామాన్ని పూర్వం ‘వొణుకుబాడు’/ ‘పొణుకుపాడు’ అనే పేర్లుతో పిలిచినట్లుగా తెలుస్తుంది. ఆ తరువాత సుమారు 100 సం.ల క్రితం నుండి “పొనుగుపాడు” గా పిలుస్తున్నట్లు ప్రభుత్వ రికార్డు ద్వారా తెలుస్తుంది.
కైఫియ్యత్తుల లోని పదాలకు అర్థాలు:
- 1. మజుకూరి = A fore said, above mentioned, పైన వివరింపబడిన.
- 2.మిరాసిదారుడు = hereditary right, వంశ పరంపరంగా వచ్చే బాధ్యత.
- 3.ఫసలి =The revenue year which begins on the 14th of July. రెవిన్యూ లెక్కల సంవత్సరం.
- 4.కైపియ్యత్తులు= సంగతులు, విషయాలు, కవిలకట్ట.
- 5.అరకుచ్చల = 22 యకరంలకు సమానం.
- 6.సంప్రతివారు = కరణం హోదా కలవారు.
- 7.మృత్యజాంన్నగరు/ముర్తిజానగరు సర్కారు =The Persian name of Guntur, Like Andhra Sarkar.
- 8.మవుంజె = ఒక వూరిలో చిన్నపల్లె.
- 9.సమంతు = తాలూకాలో ఒక భాగం.
- 10.హైవేలి = నగరు.
- 11. ముఠే = కొన్ని గ్రామాలు.
పై కైఫియ్యత్తుల ప్రకారం వెంకంరాజు ప్రధమ కుమార్డు పాపరాజు దేవాలయం నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఆ దేవాలయంలో శ్రీ అంజనేయస్వామి విగ్రహం ‘సిద్ధార్ధి’ నామ సంవత్సరం (1799-1800) లో ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.అంతేగాదు పూజాది కార్యక్రమంలు జరుగుటకు పెరంబుదూరు కేశవాచార్యులు అనే పాంచరాతృని (ఆగం శాస్త్రం తెలిసిన వ్యక్తి) నియమించి, అప్పటి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న శ్రీరాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారితో చెప్పి అరకుచ్చల భూమిని (22 ఎకరంలకు సమానం) ఇనాంగా ఇప్పించారు.ఇప్పటికి ఆ భూమి శ్రీ అంజనేయస్వామి దేవాలయం ఆధీనంలో ఉంది.
పొనుగుపాటి వారి వంశవృక్షం-2 (CLICK HERE)
ఈపై వంశవృక్షానికి మూల పురుషుడు వేంకటరమణయ్య, తులిశమ్మ దంపతులు. ఈయన కుమార్డు ఈశ్వరయ్య, పిచ్చమ్మ దంపతుల రెండవ కుమార్డు వేంకటరమణయ్య పైన చూపబడిన మూల పురుషుడు వెంకంరాజు వంశవృక్షంలోని మూడవ సంతతి వాడైన పొనుగుపాటి అయ్యపరాజుకు చెందిన వారసుల లో వెంకటప్పయ్య, సుబ్బమ్మ దంపతులకు దత్తు పోయాడు.
వేంకట రమణయ్య 20 శతాబ్థం మొదట్లో పొనుగుపాడు గ్రామానికి కరణంగా పనిచేసాడు. ఈయన గ్రామంలో ప్రస్తుతం ఉన్నపెద్దవారు మర్రి గోపాలకృష్ణయ్య, రాయంకుల తాతయ్య (పంతులుగారు) గార్లకు ఇంకా మరి కొంతమందికి తెలుసు.
వేంకటరమణయ్య దత్తు కుమార్డు లక్ష్మి కాంతారావు.

వేంకటరమణయ్యకు సంతతి లేదు. ఈయన నరసరావుపేట మండలం, రూపినగుంట్ల గ్రామానికి చెందిన రామదాసయ్య, ఆదిలక్షమ్మ దంపతుల కుమార్డు లక్ష్మి కాంతరావును దత్తు కుమార్డుగా స్వీకరించాడు. దత్తు తండ్రి వేంకటరమణయ్య తరువాత కరణీకం వృత్తి వంశపార్యపరంగా లక్ష్మి కాంతరావుకు దక్కింది. వీరు మేడికొండూరు మండలం, పాలడగు గ్రామానికి చెందిన పాలడగు కుటుంబరావు, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రీదేవిని వివాహమాడారు.
లక్ష్మి కాంతారావు, శ్రీదేవి దంపతుల సంతానం కుమార్తె వెంకట రమణమ్మ, కుమార్డు వెంకట రమణయ్య.
భార్య శ్రీదేవి మరణానంతరం తిరిగి ఖమ్మం జిల్లా గడ్డమణుగు నరసింహారావు, సీతారామమ్మ దంపతుల కుమార్తె అనంతరామమ్మను వివాహమాడారు. ఈమె సంతానం ఇద్దరు కుమారులు. వెంకట నాగభూషణం, సీతా రామ చంద్రరావు వరఫ్ శ్రీనివాసరావు. ఇద్దరు కుమార్తెలు. శ్రీలక్ష్మి, విజయలక్ష్మి సరస్వతి.లక్ష్మి కాంతారావు కరణీకం చేస్తూనే, 1951లో నూతనంగా మంజూరైన తపాలా కార్యాలయం మొదటి పోష్టు మాష్టరుగా నెలకు 20/- ల వేతనంపై నియమించ బడ్డారు. గ్రామ కరణీకం, పోష్టు మాష్టరుగా పనిచేస్తూ 1958లో పరమపదించారు.దత్తు తండ్రి వేంకట రమణయ్య తరువాత శ్రీ అంజనేయ స్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తగా పనిచేసారు.
కరణీకం వ్యవస్థలో గ్రామానికి పనిచేసిన చివరి కరణం.

లక్ష్మికాంతారావు చనిపోయేనాటికి మొదటి భార్య శ్రీదేవి కుమార్డు వెంకట రమణయ్య మైనరు. వెంకట రమణయ్య మేజరు అయ్యేంత వరకు మునగపాటి కరణం తిరుపతిరావు ఇన్ చార్జిగా పనిచేసారు.
స్వర్గీయ నందమూరి తారకమారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ది.06.01.1984న గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసారు. మేజరు అయిన తరువాత ఉద్యోగంలో చేరినప్పటి నుండి గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసేంత వరకు వెంకట రమణయ్య చివరి కరణంగా పనిచేసారు.
అంతేగాదు శ్రీ అంజనేయ స్వామి దేవస్థానంనకు చివరి వంశపారంపర్య ధర్మకర్తలు గా పనిచేసిన వారిలో వెంకట రమణయ్య చివరి వారు. వెంకట రమణయ్య, బాల త్రిపుర సుందరి దంపతులకు ఇద్దరు కుమారులు. శ్రీకాంత్, నాగశ్రీధర్ శర్మ. ఒక కుమార్తె శ్రీదేవి.
వెంకట రమణయ్య ఉద్యోగం చేస్తూ అరోగ్యం క్షీణించి ది.03.09.2002న చనిపోయారు. వెంకట రమణయ్యకు ముందే భార్య బాల త్రిపుర సుందరి పరమ పదించినది. ఉద్యోగరీత్యా కుమారులు శ్రీకాంత్ గుంటూరులో, నాగ శ్రీధరశర్మ బాపట్లలో ఉంటున్నారు.
కేదార్ నాధ్ యాత్రలో చనిపోయిన నాగభూషణం కుటుంబం
లక్ష్మి కాంతారావు రెండవ భార్య అనంత రామమ్మ కుమార్డు వెంకట నాగ భూషణం (మూడవ సంతానం) పోష్టల్ డిపార్టుమెంటు లో ఉద్యోగం చేస్తూ, హైదరాబాదు, మీర్ పేట లోని స్వంత గృహంలో నివాసం ఉండేవారు.2013 జూన్ లో కేదార్ నాద్ యాత్రకు భార్య వేంకట లక్ష్మీపద్మావతి, ఇంజనీరింగు చదువుచున్న ఏకైక కుమార్తె సాయిశ్రీతో వెళ్లారు. దురదృష్టావశాత్తు వరద ప్రళయంలో చిక్కుకొని ముగ్గురు చనిపోయారు. ఇది చాలా విచారించ వలసిన విషయం.
పై రెండవ వంశవృక్షంలోని ఈశ్వరయ్య పిచ్చమ్మ దంపతుల మూడవ కుమార్డు సీతారామయ్య, అన్నపూర్ణమ్మ దంపతుల సంతతిలో ప్రథమ కుమార్డు కోటేశ్వరరావు (పంతులుగారు).
కోటేశ్వరరావు (పంతులుగారు).మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల (బాలికల) ఉపాధ్యాయుడు గా పని చేసారు. బాలికల పాఠశాలకు భవన వసతి లేనందున పడమర బజారులోని తన స్వంత స్ధలంలో ఉచితంగా షెడ్డు నిర్మించి పదవీ విరమణ చేసే వరకు వసతి కల్పించారు. లక్ష్మి కాంతారావు పరమపదించిన తరువాత కుమారుడు వెంకట రమణయ్య మైనరు అయినందున కోటేశ్వరరావు పంతులుగారు శ్రీ అంజనేయస్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తగా బాధ్యతలు తీసుకుని చాలా కాలం పనిచేసారు.
రెండవ కుమార్డు వేంకట సుబ్బారావు ఉద్యోగరీత్యా గ్రామాంతరం. మూడవ కుమార్డు సత్యనారాయణ మాదల లక్ష్మీకాంతంకు దత్తు పోయారు. నాలుగవ కుమార్డు ఈశ్వరయ్య నిస్సంతు.
స్వాతంత్ర్య సమర యోధుడు వేంకట నాగభూషణం
ఈశ్వరయ్య పిచ్చమ్మ దంపతుల నాలుగువ సంతానం వేంకట నాగభూషణం. పొనుగుపాటి వారి మూల పురుషుడు వెంకంరాజు చతుర్థ కుమారుడైన వీర్రాజు మనవడు కాంతయ్యకు సంతానం లేనందున వేంకట నాగభూషణంను దత్తు కుమార్డుగా స్వీకరించారు.వీరు స్వాతంత్ర్య సమర యోధుడు.
సత్యాగ్రహంలో పాల్గొనినందుకు బ్రిటీసు ప్రభుత్వం 29.07.1930 న ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.జైలు శిక్ష పూర్తి అయిన తరువాత విజయవాడలో ఆర్యవైశ్య వారపత్రిక సంపాదకులుగా పనిచేసారు.ఆ తరువాత తిరిగి పొనుగుపాడు గ్రామం వచ్చారు.
వెంకట నాగభూషణం గారిని రాజకీయ బాధితుడుగా ప్రభుత్వం గుర్తించింది.ఆయన మరణానంతరం భార్య సుబ్బమ్మకు ప్రభుత్వం ఫించను మంజూరు చేసింది. పొనుగుపాడు సర్వే నెం.రు 818-1 (కోనాయకుంట) లో య.2-99 సెంట్లు, అదే నెం.రు 2 లో 2-50 సెంట్లు భూమికి పట్టా ఆమెకు మంజూరు చేసింది.
పొనుగుపాటి అప్పయ్య,జానికమ్మ దంపతుల వంశవృక్షం.(CLICK HERE)
ఈ పై వంశవృక్షం ప్రకారం మూల పురుషుడు వెంకంరాజు మదిమనవడు అప్పయ్య, మహలక్ష్మమ్మ. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. ప్రదమ కుమార్డు వెంకటప్పయ్య. ద్వితీయ కుమార్డు సుబ్బయ్య. తృతీయ కుమార్డు లక్ష్మయ్య.

తృతీయ కుమార్డు లక్ష్మయ్య, జానికమ్మఈ దంపతుల కుమార్డు అప్పయ్య శర్మ వరఫ్ అప్పయ్య. వీరిని ఎక్కువగా పంతులప్పయ్య అని పిలిచేవారు. ఆయన భార్య బ్రమరాంబ.
ఈ దంపతులు ఇప్పడు ఉన్న పెద్దవారికి బాగా తెలుసు.నాకైతే అప్పయ్య గారు గుర్తు లేదు గాని, బ్రమరాంబ గారు బాగా గుర్తు. వీరి ఇల్లు లోగడ బ్రహ్మంగారి దేవాలయం ఎదురుగా ఉండేది. ఈ దంపతుల సంతానం జానికి రామయ్య, లక్ష్మి నారాయణరావు.
గ్రంధాలయ కార్యదర్శిగా పనిచేసిన జానికి రామయ్య
ప్రధమ కుమార్డు జానికిరామయ్య 1930 ఆ ప్రాంతం లో పొనుగుపాడు శ్రీ శారదా గ్రంధాలయ కార్యదర్శిగా పనిచేసారు.ఈయన భార్య హనుమాయమ్మ.
ఈ దంపతుల సంతానం ఇద్దరు కుమారులు వెంకటేశ్వర శర్మ, మురళీధరరావు. ఒక కుమార్తె సీతమ్మ.
ప్రధమ కుమార్డు వెంకటేశ్వరశర్మ చీరాల ఆర్.టి.సి. లో సీనియర్ ట్రాఫిక్ ఇనస్పెక్టరుగా పని చేసి 1993 జూన్ 30 న పదవీ విరమణ పొందారు. తదుపరి చీరాలలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.
ప్రస్తుతం 80 సంవత్సరంల పైబడి వయసులో ఉండి భార్య బేబి సరోజినితో పొనుగుపాడు సమీపంలో నున్న గుండాలపాడు గ్రామంలో సోదరి సీతమ్మ వద్ద శేష జీవితం గడుపు చున్నారు.ద్వితీయ కుమార్డు మురళీదరరావు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కంపెనిలో పనిచేసి 2001లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం మంగళగిరిలో స్థిర నివాసంతో శేష జీవితం గడుపుచున్నారు.
ద్వితీయ కుమార్డు లక్ష్మి నారాయణ వరప్ లక్మయ్య.వీరి భార్య ఆదిలక్ష్మమ్మ.లోగడ వారు నివశించిన ఆ ఇంటిని ప్రస్తుతం నివాసం ఉంటున్న యలం సూర్యనారాయణ తండ్రి విశ్వనాధం విక్రయం చేసారు.ఈ దంపతుల సంతానం కుమార్డు వెంకట సుబ్బారావు. కుమార్తెలు ఇద్దరు.లక్ష్మీకామేశ్వరి, కుసుమకుమారి. ఆదిలక్ష్మమ్మ చివరి కాలంలో కుమార్తెలుతో నరసరావుపేటలో నివసించింది. కుమార్డు వెంకటసుబ్బారావు కాలం చేసినట్లుగా తెలుస్తుంది.
మరి కొందరి వంశీయుల ఫొటో గ్యాలరీ
[/vc_column_text][vc_media_grid element_width=”3″ item=”basicGrid_NoAnimation” initial_loading_animation=”none” grid_id=”vc_gid:1496231474989-d3d5c285-ce06-10″ include=”13873,13877,13878,13875″][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row]కళ్ల చెరువు గ్రామం వలస వెళ్లిన ప్రసాదరావు పూర్వీకులు
చదవటానికి ఈ లింకు పై క్లిక్ చేయండి